AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేటీఆర్‌వి ‘మురికి’రాజకీయాలు

దసరాలోపే పేదలకు డబుల్‌ బెడ్రూలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ బడా బాబులు అనేక చెరువులు, నాలాలు కబ్జాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. దాని ఫలితంగా అనేక మంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో వరదలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పైలట్‌ ప్రాజెక్టు లో భాగంగా ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో కుటుంబ డిజిటల్‌ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన డబుల్‌ బెడ్రూంలను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నామని ప్రకటించారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లోందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు లక్ష 33 వేల ఇండ్లకు టెండర్లు పిలిచారన్నారు. వాటిలో కేవలం 65–66 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. మేము వచ్చాక బేషజాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను ఈ తొమ్మిది నెలల్లోనే పూర్తి చేశామన్నారు. సీఎం ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా కానుకగా అందించబోతున్నామని ప్రకటించారు.

రాజకీయ స్వార్థంతో..
నాడు అధికారంలో ఉండగా కబ్జాలు తొలగించాలని స్టేట్‌ మెంట్లు ఇచ్చిన కేటీఆర్‌ .. నేడు రాజకీయ లబ్ధి కోసం, స్వార్థంతో ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మూసీ నిర్వాసితులకు 15 వేల ఇండ్లు కేటాయించాం. ఇంకా అవసరం అయితే మరో నాలుగైదు వేల ఇండ్లు పేదలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. పింక్‌ మీడియాతో సామాన్య ప్రజలను రెచ్చగట్టాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పినా మారకపోవడం బాధాకరం అన్నారు. ప్రతిపక్షం సహేతుకమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ డబ్బులిచ్చి కొంత మంది చేత ప్రభుత్వంపై అబండాలు వేసినంత మాత్రాన మా దృష్టిని మళ్లించలేరన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10