ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పనులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 116.2 కి.మీ. పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల కిందట ఆమోదం తెలిపారు. మరోవైపు మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మెుత్తం రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. ఈ దశలోనే కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీకీ సైతం మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ(కారిడార్-4) 36.6 కి.మీ. మేర నూతన లైన్ నిర్మాణానికి పచ్చా జెండా ఊపింది. అలాగే శంషాబాద్ విమానాశ్రయం కారిడార్‌లో సుమారు 1.6కి.మీ. మేర భూగర్భ మెట్రో మార్గానికి సైతం ఆమోదం తెలిపింది. మరోవైపు రూ.8వేల కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్ రెడ్డి వెల్లడించారు. వీటికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.