హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సమావేశానికి పెద్దఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాగా వారికి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. సింఘ్వీ అభ్యర్థిత్వానికి సీఎల్పీ నేతలు మద్దతు తెలపగా.. వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సింఘ్వీని ఆమోదించినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయి. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదు. ఆ చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్ఠానాన్ని కోరాం. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చట్టసభలు, న్యాయస్థానాల్లో ఆయన గట్టిగా వాదనలు వినిపిస్తారు. మాజీ ఎంపీ కేకే పెద్దమనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ పేరు ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు” అని చెప్పారు.
అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎంపీ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన న్యాయవాదిగా తెలంగాణకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని గుర్తు చేశారు. భారతదేశంలో నంబర్ వన్ న్యాయవాదుల్లో ఆయన కూడా ఒకరని మంత్రి చెప్పారు. అలాంటి వ్యక్తి రాష్ట్రం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన తండ్రి ఎలెన్ సింఘ్వీ బ్రిటన్ దేశానికి భారత రాయబారిగా వ్యవహరించారని, లోక్ సభ ఎంపీగా ఉంటూనే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేశారని మంత్రి తెలిపారు. తండ్రి అడుగుజాడల్లోనే అభిషేక్ సింఘ్వీ నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.