రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు.. ప్రభాస్‌కు ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సామాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కొనియాడారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంలో.. బోసురాజు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో చాలా మంది తనకంటే గొప్పవాళ్లు వేదిక ముందు వినయంగా ఉన్నారని.. అదీ క్షత్రియుల గొప్పతనమని చెప్పుకొచ్చారు. కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది రాజులేనని పేర్కొన్నారు. మీడియాలో కూడా రాజులే రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో అడుగు పెట్టినా.. వారికి ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వంతో రాణిస్తారని వివరించారు.
మరోవైపు.. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇక.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలపారు. మరోవైపు.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తెలుగు సినిమా రేంజ్‌ను తీసుకెళ్లిన సినిమాలో బాహుబలి పాత్రను ప్రభాస్ లేకుండా ఊహించలేమని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. వీళ్లందరికీ అసలు క్యారెక్టర్ కష్టపడేతత్వమేనని.. అందుకే ఏ రంగమైనా ఇంతలా సత్తా చాటుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాజులను చట్ట సభల్లోకి తీసుకోవాలనే ఆలోచన ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తొలుత పార్టీలో అవకాశం ఇస్తామని.. తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామంటూ కీలక ప్రకటన కూడా చేశారు. ఈ క్రమంలోనే.. విశ్రాంత ఐఏఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కుమరం భీం స్ఫూర్తితో కొన్నేళ్లుగా పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర చాలా ఉందని.. ఇప్పుడు నిర్మించబోయే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని కోరారు. తమ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. హైదరాబాద్‌లో క్షత్రియ భవన్ కావాలని విజ్ఞప్తి చేయగా.. మంజూరు చేస్తానని.. మళ్లీ క్షత్రియ భవన్ నిర్మాణమయ్యాక అందులోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.