లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ స్కీమ్ కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రాష్ట్ర సర్కార్ గుర్తించింది. ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. వెంటనే ఆ వివరాలను జతచేసి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. LRS దరఖాస్తు పరిశీలనను ఈ ఏడాది జనవరిలో రేవంత్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేని, చట్ట విరుద్ధమైన లే అవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు గైడ్‌లైన్స్ జారీ చేసింది.
రాష్ట్రంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131, అలాగే 2023 జులై 31న జారీ చేసిన జీవో 135లలో ఉన్న నియమ నిబంధనలే ఇప్పుడు LRSకు వర్తించనున్నాయి. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన పర్మిషన్ లేని, చట్ట విరుద్ధమైన లేఅవుట్లు, ప్లాట్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2020లో అక్టోబర్ 15లోపు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న 4,28,232 అప్లికేషన్లను పరిశీలిస్తే.. వాటిలో కేవలం 60,213 మాత్రమే ఆమోదం పొందాయి. వీటి నుంచి రూ.96.90 కోట్లు వసూలయ్యాయి.
అయితే 75 శాతం దరఖాస్తుదారులకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు, వివరాలు అందించాలని మరోసారి సవరణకు అవకాశమిచ్చింది. ఇందులో సేల్‌డెడ్, ఈసీ, మార్కెట్ విలువ ధ్రవీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులకు జత చేయవచ్చు. అయితే దరఖాస్తుదారులు వారి ఫోన్ నెంబర్, అడ్రెస్ లేదా ఇతర వివరాలను మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా మార్చుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లు, జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సర్కార్ తెలిపింది. LRS దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలుంటే ఈ కేంద్రాలను సంప్రదించాలని సూచనలు చేసింది.