మరో పది నిమిషాల్లో స్కూల్‌కు చేరుకోవాల్సిన పదో తరగతి విద్యార్థిని సాత్విక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సికింద్రాబాద్ హబ్సిగూడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన భారీ లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న పదో తరగతి విద్యార్థిని సాత్విక తీవ్రంగా గాయపడింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆటో డ్రైవర్ల యూనియన్ ఆరోపిస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో ఈ అమ్మాయి ఒక్కతే ప్రయాణిస్తోంది. సాత్విక మృతితో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. తార్నాక కిమితి కాలనీకి చెందిన సాత్విక వెస్ట్ మారేడ్పల్లి గౌతమ్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది.. ఆటోలో సాత్విక స్కూల్ కు బయలుదేరింది.. ఈ క్రమంలో హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద.. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను ఓ భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటో.. ముందు ఉన్న ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న సాత్విక అనే విద్యార్థిని, డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు.. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే సాత్విక మరణించింది.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కాగా.. ఈ ప్రమాదానికి కారణం పోలీసుల నిర్లక్ష్యమని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్‌పై చూపడం లేదని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. భారీ లారీని ఉదయం ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు.