AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ కుట్రలు.. ఎమ్మెల్సీ కాకుండా చేయాలని చూసింది

– గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించిన రేవంత్‌కు కృతజ్ఞతలు
– ‘అమ్మన్యూస్‌’తో ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం
– ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణస్వీకారం
– ప్రమాణస్వీకారం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా.. హాజరైన మంత్రులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మొదటి నుంచీ బీఆర్‌ఎస్‌ కుట్రలకు పాల్పడుతోందని, నన్ను ఎమ్మెల్సీని కాకుండా చేయాలని చూసిందని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ ఆమిర్‌ అలీఖాన్‌ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ కోటాలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వీరిచేత ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభార్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్, విప్‌ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీఖాన్‌ లకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం ‘అమ్మన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడారు. అన్ని అడ్డంకులని దాటుకొని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశానని చెప్పారు. శాసన మండలి సభ్యుడు కావడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నా దృష్టిలో ఇది సేవ మాత్రమేనని, పదవి కాదని అన్నారు. అమరవీరులు, ఉద్యమ కారుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్ననని తెలిపారు.

సుప్రీం తీర్పుతో..
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ఎమ్మెల్సీల నియామకంపై ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. ఈ మేరకు ఇవాళ టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమెర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్‌ చాంబర్లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు.

ANN TOP 10