AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?.. ప్రజా పాలన అంటే ఇదేనా?

కంపుకొడుతున్న పల్లెలు, పట్టణాలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫైర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని తెలిపారు. ప్రజా పాలన అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా..? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని తెలిపారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే.. ?? అని కేటీఆర్‌ నిలదీశారు.

ఎందుకింత నిర్లక్ష్యం..
దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్‌ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ లో జీహెచ్‌ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా..? కాంగ్రెస్‌ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్‌ లేకుండా చేసిన మాట నిజం కాదా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అలాగే మున్సిపాలిటీల్లో పెండింగ్‌ పనులకు మోక్షం కల్పించడంలేదన్నారు.

ANN TOP 10