పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు. ప్రధాని పరారు కావడంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఢాకాలోని ప్రధాని అధికార నివాసమైన గణభాబన్‌ను చుట్టుముట్టారు.
ప్రధాని అధికార నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని విలువైన వస్తువులును లూటీ చేశారు. మాంసం, చేపలు, కూరగాయలు, విలువైన ఫర్నిచర్‌ను ఆందోళకారులు పట్టుకెళ్లిపోయినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. తన నివాసంలో ప్రధాని నిద్రపోయే మంచంపై కొందరు ఆందోళనకారులు పడుక్కున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థులు ప్రదర్శించిన తీవ్ర ఆగ్రహమే ఈ ఆందోళనలకు కారణం.