బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు సాగిస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పినట్టే కనిపిస్తోంది. ఇవాళ ఆందోళనకారులు రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు. దాంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి ‘గాన భవన్’ ప్యాలెస్ ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన హింసలో 98 మంది మరణించగా, దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి.
ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్లెక్కారు. కాగా, అధికారిక నివాసాన్ని వీడేముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డు చేయాలని భావించినా, ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు. కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్కచేయకుండా ఇవాళ వేలామంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ, భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకుని ముందుకు పోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకీర్ ఉజ్ జమాన్ దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.