బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపినందుకు తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని ఛాంబర్ వద్ద నిరసన తెలపాలన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాట ఇచ్చిన కాంగ్రెస్… ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. సన్నబియ్యం టెండర్లలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. అయినప్పటికీ సన్నబియ్యం టెండర్లను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని నిలదీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలం 25న మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం :
ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం.. అదేరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరుతుందని.. 26న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే.. బడ్జెట్లో తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చారన్నారు.