AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రేకింగ్ న్యూస్.. బీఆర్‌ఎస్‌ను వీడుతున్న హరీశ్‌రావు.. త్వరలో బీజేపీలోకి?

గతంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతుందా..? ఏందీ అని అనుకుంటున్నారు జనాలు. ఇంకొందరు నేతలేమో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు.. అది కూడా పేరు మోసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి వెళ్లారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరమీదకు వస్తోంది. సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.

ఈ అంశంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందని చెప్పారు. హరీశ్ రావు కూడా పార్టీని వీడబోతున్నారని, బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందువల్ల కేసీఆర్ రాజకీయాలను వదిలేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు.

కాగా, చాలా సందర్భాల్లో హరీశ్ రావు పార్టీ మారబోతున్నారంటూ పలువురు నేతలు పేర్కొన్న సందర్భంలో ఆయన స్పందించారు. ఆ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాను బ్రతికున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. పార్టీని విడాల్సి వస్తే తాను రాజకీయాల నుంతి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో భారీగా చర్చ కొనసాగుతుంది. హరీశ్ రావు నిజంగానే పార్టీ మారుతున్నారా..? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు హరీశ్ రావు పార్టీ మారబోతున్నారా లేదా అనేది. ఎందుకంటే.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా పార్టీని మారబోం.. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉంటామని ఇవాళ చెప్పి.. రేపు మరో పార్టీలో చేరిపోయారు. ఈ పరిస్థితులను పరిశీలించిన ప్రజలు.. హరీశ్ రావు కూడా పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.

ANN TOP 10