AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోర్టుకెక్కిన మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వివాదం

కర్ణాటక ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ అధికారి రూప దివాకర్‌ మధ్య వివాదం న్యాయస్థానం ముందుకు చేరింది. ఐపీఎస్‌ అధికారి రూప తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఐఏఎస్‌ అధికారి రోహిణి బెంగళూరులోని 24వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన పరువునష్టం కలిగించేలా సోషల్‌ మీడియా, మెయిన్‌ స్ట్రీమ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని రోహిణి ఫిర్యాదు చేశారు. తనకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంతో పాటు తాను అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారని రూపపై న్యాయస్థానంలో రోహిణి సింధూరి పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌లోని అంశాలు, ప్రమాణపూర్వకంగా ఆమె చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు IPC ఆఫీసర్‌ రూప దివాకర్‌పై క్రిమినల్‌ కేసు బుక్‌ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 26 తేదీ లోపు సమన్లు జారీ చేయాలని తన ఆదేశంలో మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు.ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం ప్రకటించింది. మహిళా IAS, IPS అధికారుల మధ్య ఫైట్‌ కర్ణాటక బ్యూరోక్రాటిక్‌ సర్కిల్స్‌ను కుదిపేసింది. ఫిబ్రవరి 19న ఈ ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు రోడ్డునపడ్డాయి. ఐఏఎస్‌ అధికారి రోహిణిపై ఐపీఎస్‌ ఆఫీసర్‌ రూప 19 ఆరోపణలు చేశారు. అంతే కాదు రోహిణిపై విచారణ జరపాలని కర్నాటక ప్రధాన కార్యదర్శికి కూడా రూప ఫిర్యాదు చేశారు.

IPS ఆఫీసర్‌ రూప చేసిన ఆరోపణలను IAS ఆఫీసర్‌ రోహిణి ఖండించారు. తనపై వ్యక్తిగత ద్వేషంతో ఆమె ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రోహిణి ఫిర్యాదు చేశారు. రోహిణి భర్త సుధీర్‌ రెడ్డి కూడా రూపపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై తర్వాత ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. కాని ఇద్దరికీ ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. IAS ఆఫీసర్‌ అయిన రూప భర్త మునీశ్‌ మౌద్గిల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. తగిన వేదికల్లో ఫిర్యాదు చేయాలని, మీ కారణంగా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ప్రభుత్వం వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. దీన్ని ఆధారం చేసుకొని మేజిస్ట్రేట్‌ కోర్టులో రోహిణి సింధూరి IPS ఆఫీసర్‌ రూపపై పరువునష్టం దావా వేశారు. ఈ ఇద్దరు అధికారుల వివాదాలు ప్రధాని కార్యాలయం వరకు చేరాయి. ఎందుకీ వాళ్ల మీద చర్యలు తీసుకోవడం లేదని ఆదేశాలు రావడంతో ఈ అధికారులకు బదిలీ ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి ఈ కేసు ఇప్పట్లో తేలేలా లేదు. మరి న్యాయస్థానం ఆదేశాలతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10