AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియాదే ప్రపంచకప్.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విజయం!

ఎందరో భారతీయుల కలలు ఫలించాయి. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన టీమిండియా తాజా ప్రపంచకప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం పాలవలేదు. అద్భుత ఆటతీరుతో విజయం సాధించింది.

కీలక మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ..
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌‌ల్లో విఫలమై పరుగుల కోసం కష్టపడిన “కింగ్“ కోహ్లీ అసలైన మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. వికెట్లు పడినపుడు నెమ్మదిగా, చివర్లో వేగంగా పరిస్థితులకు తగినట్టు ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కోహ్లీకి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (47 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 47) సహకరించాడు. చివర్లో శివమ్ దూబే (16 బంతుల్లో 27) కూడా బ్యాట్ ఝుళిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

భయపెట్టిన క్లాసెన్..
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు షాకిచ్చారు. హెండ్రిక్స్, మార్క్రమ్ త్వరగానే అవుటయ్యారు. అయితే మరో ఓపెనర్ డికాక్ (39), స్టబ్స్ (31) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. స్టబ్స్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసన్ (26 బంతుల్లో 52) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దక్షిణాఫ్రికాను విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. అయితే హార్దిక్ అద్భుతమైన బంతితో క్లాసెన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. బుమ్రా, అర్ష్‌దీప్ అద్భుతమైన ఓవర్లు వేసి పరుగులను కట్టడి చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు మిల్లర్ అవుటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ మరో వికెట్ తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కోహ్లీ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌“గా, జస్ప్రీత్ బుమ్రా “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌“గా నిలిచారు. కాగా, ఇదే తన చివరి టీ20 ప్రపంచకప్ అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించాడు.

ANN TOP 10