చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణి మరణంతో విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రూపదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఉన్నారు.
రూపాదేవి గత రెండేండ్లుగా కడుపు నొప్పుతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కారణంగానే గత వారం రెండు రోజుల పాటు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్నారు. ఆమె చనిపోయినప్పుడు తాము ఇంట్లోనే ఉన్నట్లు రూపాదేవి తల్లి, కుమారుడు, కుమార్తె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పారు. కాగా, భార్య మృతి వార్త తెలిసుకున్న ఎమ్మెల్యే సత్యం.. రక్తపోటు తగ్గి దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.