AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదివాసీ బాధిత మహిళను పరామర్శించిన మంత్రి జూప‌ల్లి.. అండగా ఉంటానని భరోసా

నాగ‌ర్ క‌ర్నూల్ ప్రభుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ బాధిత మ‌హిళ‌ను ఎక్సైజ్, ప‌ర్యాటక‌ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప‌రామ‌ర్శించారు. మొల‌చింత‌ల‌ప‌ల్లి తాండకు చెందిన‌ మహిళపై ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భరోసానిచ్చారు మంత్రి జూపల్లి. బాధిత మ‌హిళ ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… చెంచు మ‌హిళ‌పై జ‌రిగిన దాష్టీకాన్ని హేయ‌మైన ఆట‌విక చ‌ర్యగా అభివ‌ర్ణించారు మంత్రి జూపల్లి. న‌లుగురు వ్యక్తులు బాధిత మ‌హిళ‌ల‌పై పాశ‌వికంగా దాడి చేసి అమాన‌వీయంగా ప్రవ‌ర్తించార‌ని పేర్కొన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పాశ‌విక ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్పందించామ‌ని, జిల్లా ఎస్పీతో పాటు ఇత‌ర పోలీసు అధికారుల‌కు ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుల‌ను అరెస్ట్ చేసి, క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు వివ‌రించారు. నిందితుల‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశార‌న్నారు. ఇలాంటి దాడుల‌కు పాల్పడితే ఊపేక్షించేది లేద‌ని, నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌ని, రూ. 2 ల‌క్షల ఆర్థిక స‌హాయం ప్రక‌టించారు. వారి ముగ్గురు ఆడ‌పిల్లల‌కు రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో ఉచిత విద్యను అందిస్తామ‌ని చెప్పారు. కుటుంబంపై ఆర్థిక భారం ప‌డ‌కుండా చూస్తామ‌ని, వారి కాళ్లపై వారు నిల‌బ‌డేలా ప్రభుత్వం అండ‌దండ‌గా ఉంటుంద‌ని వెల్లడించారు.

ANN TOP 10