AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్

హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పరీక్ష అవకతవకలపై యువజన విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

నీట్ పరీక్ష విధానంలో జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. అయితే అనుమతి ఇవ్వకపోవడంతో యువజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బర్కత్ పురలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేపడుతున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌తోపాటు ఎన్ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.

కాగా, నీట్ రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నీట్‌లో జరిగిన అవకతవకలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్..నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ పాలన పేపర్ లీకుల సర్కార్‌గా మారిందని విమర్శలు చేశారు.

ANN TOP 10