AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

కళ్లముందు నీరున్నా తోడుకోలేనంతగా భారంగా మారాయి ఎత్తిపోతల పథకాలు. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. పథకం నిర్వహణపై రైతులకు అవగాహన లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిప్టుల పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్‌. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిఫ్టు ఇరిగేషన్ పథకాలు మూలనపడ్డాయి. బీడు భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పనిచేయడంలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 167 పథకాలుంటే.. ఇందులో కనీసం సగం కూడా నీటిని ఎత్తిపోయడంలేదు. కేవలం 32 మాత్రమే పని చేస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతుల అవగాహన లోపం.. నిధుల కొరత సమస్యగా మారడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి రాష్ట్రలో జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా జిల్లాలో పలుచోట్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ పథకం మొదట్లో కొంత పని చేసినా.. తర్వాత మరమ్మత్తులకు గురై నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల వరకు ఎత్తిపోతల ద్వారా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని వీటిని నిర్మించారు. అయితే ఎత్తిపోతల పథకాలపై సంబంధిత ఆయకట్టు రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం, దీనికితోడుగా సదరు రైతులు పథకాల నిర్వహణలో పూర్తిస్థాయి భాగస్వామ్యం పంచుకోకపోతుండడంతోనే పరిస్థితి గందరగోళంగా మారుతోంది. లిఫ్ట్‌లు కూడా ఒక్కొక్కటీ శిథిలావస్థకు చేరాయి. వీటిని మరమ్మత్తు చేయించాలంటే సుమారు పది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఇటీవల ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విధానం అమల్లోకి వస్తే జిల్లాలో ఉన్న లిఫ్టు ఇరిగేషన్ దశ మారే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని వీటి నిర్వహణపై దృష్టి సారించాల్ని రైతులు కోరుతున్నారు.

ANN TOP 10