త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చేనెల ఒకటో తేదీ లోగా ఓటర్ల జాబితాల సవరణకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ఆగస్టు 20న ప్రచురిస్తామని తెలిపింది.
శ్రీనగర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ త్వరలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించిన మరునాడే కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని ఈసీ తెలిపింది. జమ్ముకశ్మీర్ లో సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతం ఓటింగ్ నమోదైంది. 2018లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు.
ప్రస్తుత హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ మూడో తేదీ, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26, జార్ఖండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరితో ముగియనున్నది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 30 లోపు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదనుగుణంగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పునర్విభజన ద్వారా అసెంబ్లీ స్థానాలను 83 నుంచి 90కి పెంచారు.









