పల్నాడు: మాచర్ల పోలింగ్ కేంద్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఆ సమయంలో విధుల్లో పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఘటన సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్‌లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీవో, ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారని, సంఘటన సమయంలో వారిని వ్యతిరేకించలేదనే అభియోగాలతో సస్పెండ్ చేసింది.
గురువారంలోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం సదరు సిబ్బందిని ఆదేశించింది. ఈ ఘటనపై పాల్వాయిగేటు పోలింగ్ కేంంద్రం పీఓ సరియైన సమాధానం ఇవ్వలేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.
కాగా, పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఈవీఎం ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని సీఈవో చెప్పారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారని ఎంకే మీనా పేర్కొన్నారు. మే 20న కోర్టులో రెంటచింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారని, ఏ-1 నిందితుడిగా పిన్నెల్లిని ఎస్సై పేర్కొన్నారని తెలిపారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.