బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం.. ప్రమాదం జరిగింది. లిక్కర్ లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పిన లారీ.. డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో.. దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. లారీ డోర్ తెరుచుకుని.. మద్యం బాటిళ్లన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై కుప్పులుగా పడి ఉన్న మద్యం బాటిళ్లను చూసిన వాహనదారులు.. ఎగబడిపోయారు. మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. దొరికినోళ్లకు దొరికినన్ని అన్నట్టుగా చేతులకు అందినన్ని పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే చాలా వరకు బాటిళ్లు లూటీ అయ్యాయి.