ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ వందశాతం గెలుపు ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ప్రజాసేవా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో శ్రమించారని చెప్పారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని చేయడం ప్రతి ఒక్కరి లక్ష్యమని తెలిపారు. తమకు ఏ పార్టీ పోటీ కాదని, పదేళ్లు బీఆర్ఎస్-బీజేపీ ఆదిలాబాద్‌కు చేసిందేమిలేదని విమర్శించారు. మతకల్లోలాలు సృష్టించేందుకు పాయల్ శంకర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించాయని చెప్పారు. గిరిజన-లంబాడాలు అక్కున చేర్చుకున్నాయని, ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆత్రం సుగుణ హామీ ఇచ్చారు.









