రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేశారని రైతులు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలో మీడియాతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు రైతులు మద్దతు నిలిచారని అన్నారు. రైతు భరోసా వేయనందుకే రైతులు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. మహిళలు కూడా కాంగ్రెస్‌పై కోపంతో ఉన్నారని చెప్పారు. బీజేపీపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టత కనిపిస్తోందని, పెట్రోల్ ధరలు పెంచినందుకు మోడీపై కోపంతో ఉన్నారని అన్నారు. ఈసారి సగం సీట్లు బీఆర్ఎస్ బీసీలకు ప్రకటించిందని తెలిపారు. ఢిల్లీలో గస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ తీరు ఉందని దుయ్యబట్టారు. ఆరేడు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించారని కేటీఆర్ ఆరోపించారు.









