కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ఐదుగురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కామెంట్స్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెలేలు తమ పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఇదివరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు కామెంట్స్ చేశారు. తాజాగా జగ్గారెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని అన్నారు. ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని తెలిపారు. బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని ప్రశ్నించారు. ఆగస్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు.
*ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్*
లక్ష్మణ్ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన పండితుడు లెక్క జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనటంలో అర్ధం ఏంటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు తమ పథకాలతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నాయకులు కన్ఫ్యూజ్ అవుతూ ప్రజలను కూడా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు. హామీలు ఇచ్చి ఎగనామంపెట్టడంలో బీజేపీ నాయకులు ఎక్స్ పెర్ట్లు అని సెటైర్లు వేశారు. ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబానికి మోసం తెలియదని అన్నారు. ప్రతి విషయంలో బీజేపీ నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రగల్భాలు పలుకుతారని, హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు.









