ఉత్తర కొరియాలో నియంత పాలన కొనసాగుతోంది. కిమ్ అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే అక్కడి ప్రజలు దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రపంచానికి దూరంగా ఉత్తర కొరియా వాసులు కొన్నేళ్లుగా గడుపుతున్నారు. ఆంక్షల చట్రంతో ప్రజలను కిమ్ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారు ఏం తినాలో ఆయనే చెబుతారు. వారి ఇష్టాలతో పనిలేదు. ఆయన నవ్వమంటే నవ్వాలి.. ఏడమంటే ఏడవాలి. అవును అక్కడే పరిస్థితి ఇదే. తాజాగా, మహిళలు పెదవులకు ఎరుపు రంగులో ఉండే లిప్‌స్టిక్ వాడొద్దని ఆదేశించారు.
విచిత్రమైన నిబంధనలు, కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయనే నిర్ణయిస్తారు. ప్రజలు ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు. ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు విధిస్తుంటారు. తాజాగా, మహిళలు పెదవులకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ పూసుకోవడంపై నిషేధం విధించారు. రెడ్ లిప్‌స్టిక్‌ను పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా కిమ్ రాజ్యం భావిస్తోంది. అంతేకాదు, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని బలమైన నమ్మకం. ఇప్పటికే ఉత్తర కొరియాలో మహిళల మేకప్‌పై నిషేధం కొనసాగుతోంది.









