ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కేరళ వయనాడ్ ఎంపీ స్థానం మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆయన సిట్టింగ్ ఎంపీ. అలాగే, కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో సైతం బరిలోకి దిగారు.
కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ మొన్నటి వరకు పోటీ చేస్తూ వచ్చారు. ఆమె స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీజేపీ, ఎన్డీయే సర్కారు వైఖరిపై ఆయన తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలితో కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేశారన్న రాహుల్.. ఇది తమకు కర్మభూమి లాంటిదన్నారు. సభలో పాల్గొన్న పలువురు జనం రాహుల్ జీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘ఇప్పుడు నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు (అబ్ జల్దీ హి కర్నీ పడేగీ)’ అని నవ్వి అభివాదం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు. అక్కడే ఉన్న ప్రియాంక గాంధీ సైతం నవ్వుతూ ఉండడం కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









