AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు… హైదరాబాద్ లో అరుదైన దృశ్యం..

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయ నేతల ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలంతా రంగంలోకి దిగి.. క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. ఎన్నికల వాతావరణ హీటెక్కిపోతోంది. రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉన్నా.. హైదరాబాద్ పార్లమెంట్ (Hyderabad Lok Sabha Constituency) పరిస్థితి మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్ బరిలో ఎంఐఎం నుంచి ఓటమి ఎరుగని అసదుద్దీన్ ఒవైసీ మరోసాగి దిగుతుండగా.. ఆయనపై బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత పోటీ చేస్తున్నారు.

దీంతో.. హైదరాబాద్‌ బరిలో మిగతా పార్టీల నేతలు ఉన్నా.. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. దానికి కారణం.. మాధవీలత చేస్తున్న ప్రచారం, క్యాంపెయిన్‌లో భాగంగా ఆమె చేస్తున్న కామెంట్లు, చర్యలే. అయితే.. కేవలం మాధవీలతే కాదు.. ఆమె తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు కూడా వస్తుండటంతో.. అందరి దృష్టి హైదరాబాద్‌పైనే పడింది. అంతేకాదు.. బీజేపీ నేతలకు ఒవైసీకి మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. నరేంద్ర మోదీ కూడా ముస్లింల గురించి కామెంట్లు చేయటం వాటికి ఒవైసీ కూడా ఘాటుగా కౌంటర్లు ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న అసదుద్దీన్ ఒవైసీకి స్థానికంగా ఉన్న కొందరు పురోహితులు మద్దతు తెలపటం ఆసక్తికరంగా మారింది. అసదుద్ధీన్ ఓవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా.. శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ముగ్గురు పురోహితులు అసదుద్దీన్‌ను కలిసి.. ఆయనకు పూలమాల వేసి మరీ మద్దతు తెలిపారు. అందుకు సబంధించిన ఫొటోను అసదుద్దీనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. మజ్లిస్ పార్టీకి అండగా అన్ని మతాలవారు నిలబడ్డారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ANN TOP 10