10 రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. జనాలు వడగాలలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేడిగాలులు వచ్చే వారం నుండి తగ్గుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మే 6 వరకు రాష్ట్రంలో హీట్‌వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. మే 7 నుండి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మే 7వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ వార్త.. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రిలీఫ్ ఇస్తుందనే చెప్పాలి. వర్షాలు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతాయని IMD అంచనా వేసింది.
అప్పటి వరకు, హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కుమురం భీమ్, ఆసిఫాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శుక్రవారం, నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.
తెలంగాణ జిల్లాల్లోనూ వేడి తీవ్రత పెరిగింది. మంచిర్యాలలోని హాజీపూర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. కరీంనగర్‌లోని వీణవంక , నల్గొండలోని ఇబ్రహీంపేట, సూర్యాపేటలోని మామిళ్లగూడెంలో కూడా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.









