ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆ సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రవీంద్రన్ క్యాట్ కోచింగ్ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్ ఆయనకు స్టూడెంట్, రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్ మోహన్‌కు సంస్థలో పేరుంది. ఈయన సుమారు 11 ఏళ్ల పాటు బైజూలో రవీంద్రన్ పనిచేశారు. గతంలో కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటు అప్‌గ్రాడ్ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో అనుబంధ సంస్థ ఆకాశ్ కార్యకలాపాలను కూడా ఆయనే పర్యవేక్షించారు. గతేడాది సెప్టెంబర్‌లో మృణాల్ మోహిత్ స్థానంలో ఇండియా సీఈవోగా అర్జున్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. సంస్థ పునర్వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరుణంలో అర్జున్ మోహన్ రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.
