ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషీయల్ రిమాండ్ విధిస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కవితను మరోసారి తీహార్ జైలుకు తరలించారు. అయితే కవిత సీబీఐ కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం ఆమెను ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి ముందు అధికారులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సీబీఐ అధికారులు వాదనలు వినిపించారు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించలేదని, కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. ఈ తరుణంలోనే కోర్టు 9 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఈనెల 23వ తేదీ వరకు జ్యుడిషీయల్ కస్టడీలో ఉండనున్నారు.
*సీబీఐ రిమాండ్ రిపోర్టులో కవితపై ఆరోపణలు..*
మూడు రోజుల కస్టడీకి కవిత సహకరించలేదని సీబీఐ రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. శరత్ చంద్ర రెడ్డి దగ్గరి నుంచి తీసుకున్న రూ. 14 కోట్లపై కవిత తప్పుదోవ పట్టించేలా జవాబులు చెబుతున్నారని తెలిపింది. లేని భూమి ఉన్నట్లుగా చూపి అమ్మకానికి పాల్పడటంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్ర రెడ్డి, విజయ్ నాయర్ మీటింగ్‌లపై ప్రశ్నించినట్లు తెలిపింది. దర్యాప్తును, సాక్ష్యులను కవిత ప్రభావితం చేయగల వ్యక్తి అంటూ సీబీఐ పేర్కొంది. ఆధారాలు కూడా ధ్వంసం చేసే అవకాశం ఉందని సీబీఐ రిమాండ్ రిపోర్టులో ఆరోపణలు చేసింది.
*ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: కవిత*
మరోవైపు కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా అవే ప్రశ్నలను తిప్పి తిప్పి అడుతున్నరంటూ ఆమె పేర్కొన్నారు. బయట బీజేపీ నేతలు మాట్లాడిన మాటలనే సీబీఐ తమను అడుగుతుందన్నారు. వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని కవిత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది.