ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్‌లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవిత మెడికల్ రిపోర్టులను లాయర్లకు అందించాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని తెలిపింది. అలాగే పరుపులు, బెడ్ షీట్లు, పుస్తకాలు, మందులు, అనుమతించాలని స్పష్టం చేసింది. కొన్ని పేపర్లు, పెన్నులను కూడా ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టుకు ఈడీ తెలిపింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.