ప్రేమ.. పెళ్లి .. వీరిద్దరి జీవితంలో అనేక సంఘర్షణలను సృష్టించాయి. కలిసి జీవించేందుకు అయినవారందరికీ దూరమయ్యారు. అయినా మనసులో భరించలేని బాధను చిరునవ్వుతో దాచేస్తూ కొత్త జీవితం ప్రారంభించారు నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డి. వీరికి కూతురు నిషిక.. కవలలు తాన్యారామ్, రేయా జన్మించారు. ఓవైపు సినీ పరిశ్రమలో కొనసాగుతూనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తారకరత్న. ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులకు దగ్గరవుతున్న సమయంలో అర్థంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. నందమూరి తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు శివరాత్రి రోజునే (ఫిబ్రవరి 18న) తుదిశ్వాస విడిచారు. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అకాల మరణంతో తారకరత్న భార్య అలేక్య రెడ్డి బాధ వర్ణణాతీతం. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది. తన భర్తతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తారకరత్న జ్ఞాపకాలను షేర్ చేస్తుంది. తాజాగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.