మంత్రి పొన్నం ప్రభాకర్ మీద బండి సంజయ్ మాటలు సరికాదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పొన్నంకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీరాముడుని మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మొక్కుతున్నట్టు.. దునియాలో ఎవరు మొక్కడం లేదన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. శ్రీ రాముడు ఆదర్శ మూర్తి అని, రానున్న తరాలకి ఆదర్శమని చెప్పారు. ఆదర్శంగా బతకాలని శ్రీరాముడు చెప్పాడాని గుర్తు చేశారు. రాముడి పేరు మీద బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని, రాముడు తల్లి మాటలు విని అడవికి పోయాడాని అన్నారు. రాముడు తల్లిని గౌరవించారని, పొన్నం తల్లిని బండి సంజయ్ ఎందుకు గౌరవించలేదని ప్రశ్నించారు. వారి అమ్మని అంటే కోపం రాదా అని నిలదీశారు. నీకు కోపం రాకుంటే మేము చేసేది ఏం లేదన్నారు. రాజకీయంగా పొన్నం, బండి ఎంత కొట్టుకున్న ఎవరు పట్టించుకోరని, కానీ అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.
అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ ఎందుకు రాలే..
కేసీఆర్ కట్టింది మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనో ఆయన తేల్చుకోవాలన్నారు. మేడిగడ్డలో అవినీతిని పికడానికి వెళ్లారని కేసీఆర్ అన్నారని, మీ మామకు పద్దతిగా మాట్లాడమని చెప్పు హరీష్ రావు అని సూచించారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు వంద అంటారని, మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కదా? అని నిలదీశారు. దీనికి ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పరిశీలించారని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం జరగ వద్దని, బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులతోనే ప్రాజెక్టులు కడతారని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో సభలో చూపించారని అన్నారు. అసెంబ్లీలో చర్చకు మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని అడిగారు. అధికార పక్షం పిలిచినప్పుడు కేటీఆర్ కూడా రాలేదని అన్నారు. కడియం శ్రీహరి మాటలకు విలువ లేదని, బాల్క సుమన్ చిన్న పిల్లవాడు.. పిలగాడి తీరు ఉంటుందని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.