రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ఈ నెల 21 నుంచి వారికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అయితే సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేశారు. వారిని మినహాయించి మిగిలిన వారికి మరో రెండు రోజుల్లో శిక్షణను ప్రారంభించాలని రెడీ అయ్యారు అధికారులు. ఈ మేరకు ఆయా ప్రిన్సిపాళ్లకు శిక్షణ విభాగం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పోలీస్ నియామక మండలి నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబర్‌లో వెలువడినా న్యాయపర వ్యాజ్యాలతో తుది ఎంపిక జాప్యమైంది. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా కానిస్టేబుల్ శిక్షణను పూర్తి చేయాలని భావించింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు ఎంపిక పత్రాలను అందజేయడంతో శిక్షణ విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అదే విధంగా టీఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణ నుంచి ప్రస్తుతం మినహాయించగా.. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్పీఎఫ్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీస్ శాఖలకు లేఖలు రాసిన అధికారులు అక్కడి కేంద్రాల్లో అనుమతివ్వాలని కోరారు. ఇది కూడా కుదరని పక్షంలో 9 నెలల పాటు జరిగే ఇతర కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసు అకాడమీలో ఇప్పటికే 500 మందికి పైగా ఎస్సైలు శిక్షణలో ఉండగా.. మరో 653 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.