ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టుల చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈనెల 20 విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టు తలుపుతట్టింది. తాను దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసర విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. అయితే సుప్రీం కోర్టులో కవితకు షాక్ తగిలింది. ఆమె అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ముందుగా లిస్ట్ చేసిన ప్రకారమే.. ఈనెల 24వ తేదీన పిటిషన్ను విచారిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈనెల 11న తొలిసారి ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఈ కేసులో ముడుపులు, హోటల్ సమావేశాలు, ఆధారాల ధ్వంసంపై ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని ఈనెల 16న రెండోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లపై ఈనెల 15న కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని.., తన ఫోన్ లాక్కున్నారని పిటిషన్లో పేర్కొంది. మహిళను విచారించాలంటే ఇంటికి వచ్చి విచారించాలని.., సాయంత్రం ఆరు తర్వాత విచారించటాని వీల్లేదని చెప్పారు. ఈడీ అధికారులు మాత్రం వీటిని విస్మరించి తనను మానసిక ఆవేదనకు గురి చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈనెల 16న ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని కోరారు.
కవిత అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ఈడీ విచారణపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం కవిత నిన్న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆమె గైర్హాజరయ్యారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొనలేదని.., అందుకే తన ప్రతినిధి ద్వారా కావాల్సిన సమాచారాన్ని పంపిస్తున్నట్లు ఈడీ అధికారులకు లేఖ రాశారు. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున తాను విచారణకు రాలేనని చెప్పారు. దీంతో ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 20న విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.