తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను తీసుకురానుంది. ఇందుకోసం చేయాల్సింది ఏంటంటే.. రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే చాలు. తలంబ్రాల బుకింగ్ విధానాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన వివరించారు.
‘భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది’ అని సజ్జనార్ తెలిపారు.
భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో గత ఏడాది కూడా రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసింది ఆర్టీసీ.