మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు వెళ్లారు. నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను నరసింహన్ తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో నరసింహన్ కాసేపు మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల అనంతరం కేసీఆర్ వాష్‌రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు సర్జరీ జరిగింది. అప్పటి నుంచి కేసీఆర్ తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను పలువురు ప్రముఖులు పరామర్శించారు. మరోవైపు, హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని నిన్న నరసింహన్ మర్యాద పూర్వకంగా కలిశారు.
గతంలో నరసింహన్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కేసీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021, డిసెంబర్ 15వ తేదీన చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో పర్యటించారు. గవర్నర్‌గా నరసింహన్ దాదాపు పదేళ్ల కాలం పాటు పనిచేసిన విషయం తెలిసిందే. 2019 వరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు.