AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

TSPSC ప్రక్షాళన, మెట్రో విస్తరణ.. ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్ రెడ్డి

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశ రాజధాని బిజీబిజీగా గడిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం (జనవరి 5) ఉదయం యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో సమావేశమయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కార్యద‌ర్శిల‌తో సుదీర్ఘంగా భేటీ అయి టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళ‌న అంశంపై చ‌ర్చించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పటిష్టపరచడంపై సలహాలు, సూచనలను కోరారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో పాటు ఐఏఎస్‌లు అధికారులు ఉన్నారు.

యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కమిషన్ ఛైర్మన్, కార్యదర్శితో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

గురువారం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌స్యల‌పై చర్చించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ, జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని గజేంద్ర సింగ్‌ను కోరారు. హైద‌రాబాద్ మెట్రో విస్తరణ, మూసీ రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు తదితర అంశాలపై కేంద్ర గృహ‌నిర్మాణం, ప‌ట్టణాభివృద్ధి శాఖ‌ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చర్చించారు.

శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్‌ సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ. 1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని మంత్రి నిర్మలను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు.

ANN TOP 10