దేశంలో రోజు రోజుకూ కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. ఓ వైపు రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు.. మరణాలు కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్త వేరియంట్ రకం జేఎన్ 1 కేసులు కూడా చాప కింద నీరు లాగా దేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
24 గంటల వ్యవధిలోనే దేశంలో 761 మందికి కొత్తగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితోపాటు ఒక్కరోజులోనే వైరస్ ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు మాత్రమే పెరగ్గా.. ఇప్పుడు మరణాలు కూడా పెరుగుతుండటంతో దేశంలో మరోసారి కరోనా భయాలు నెలకొంటున్నాయి.
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 761 మందికి కరోనా సోకినట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు.. 24 గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఒక్కరోజే 838 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చనిపోయిన 12 మందిలో కేరళకు చెందిన వారు ఐదుగురు కాగా.. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385 కి ఎగబాకింది.









