AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లో అలెర్ట్‌ జారీ

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకీ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు రోజుల క్రితంతో పోలిస్తే ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌లో 8, గిన్నెదరిలో 8, బేలలో 9.1, బజార్‌హత్నూర్‌లో 9.3, నిర్మల్‌లో 9.5, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జంట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీచేశారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

30 విమానాల దారి మళ్లింపు ..
పొగమంచుతో ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులే కాకుండా విమాన రాకపోకలకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ వాతావరణం దృష్ట్యా శంషాబాద్‌లోని పొగమంచు కారణంగా, ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 30 విమానాలను అధికారులు దారి మళ్లించారు.

నగర శివారులో మంచు దుప్పటి ..
రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మంచు దుప్పటిలా కమ్మేస్తుంది. విపరీతంగా పడుతున్న మంచు వల్ల రహదారులన్నీ మంచుతో కమ్మేస్తున్నాయి. చలి తీవ్రత బాగా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ పొగతో కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఏర్పడుతోంది. ఇంకా కొన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే ఉండవచ్చని.. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిలో బయట తిరగకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు దట్టంగా ఉన్న ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో వృద్ధులు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ANN TOP 10