మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఎట్టకేలకు నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ నెల 9న పశుసంవర్ధక శాఖలో ఫైళ్లు మాయమైన ఘటనలో ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నాటి నుంచి కల్యాణ్ కనిపించకుండా పోయినట్లు పోలీసులు చెబుతూ వస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో ఆయన సోమవారం నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు కూడా నాంపల్లి పోలీసులు కల్యాణ్ నుంచి వివరాలు రాబడుతున్నామని, విచారణ సాగుతోందని చెప్పారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులు వివరాలు వెల్లడిస్తారని వారు పేర్కొన్నారు. కాగా విచారణలో భాగంగా కల్యాణ్ కీలకమైన సమాచారాన్ని పోలీసులు తెలిపినట్లు సమాచారం.









