అధికారులు ప్రజా ప్రతినిధులకు సహకరించి జిల్లా అభివృద్ధి కి కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోమవారం జిల్లాకు విచ్చేసిన మంత్రికి ప్రజలు, అభిమానులు అడు గడుగునా అపూర్వ స్వాగతం పలికారు.చౌటుప్పల్ మండలం ఆందోల్ కట్ట మైసమ్మ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి నల్గొండ జిల్లా పర్యటనకు బయలు దేరారు.చౌటుప్పల్ చౌరస్తా, పంతoగి టోల్ ప్లాజా, చిట్యాల సెంటర్, నార్కట్ పల్లి గుండా నల్గొండ పట్టణంకు చేరుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. నల్గొండ పట్టణంలో మర్రిగూడ బైపాస్ సెంటర్ వద్ద నుండి ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. నివాసం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్ లు మొక్కలు అందచేసి స్వాగతం పలికారు. కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, విద్యుత్, రహదారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చట్ట సభల ద్వారా శాసనాలు చేస్తుందని, ప్రభుత్వ పాలసీలు అమలు చేయడం ఉద్యోగులు బాధ్యత అని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు అధికారులు ప్రజా ప్రతినిధులకు సహకారం అందిస్తూ జిల్లాను అభివృద్ది పథంలో తీసుకువెళ్లేందుకు అధికారులు నిస్పాక్షపాతంగా పనిచేయాలి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద పేదలకు చాలా నమ్మకం, ఆశలు ఉన్నాయి. వారి ఆశల్ని మనమందరం కలిసి నిలబెట్టాలని, తమ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులను గౌరవిస్తుందని, నిబంధనల మేరకు నడచు కొవాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రతి రోజూ ముఖ్యమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు.









