తెలంగాణ రాజకీయాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకి వచ్చిన అని ఆయన చెప్పే డైలాగ్ చాలా ఫేమస్. ఇక పలు సందర్భాల్లో తాను చాలా కష్టపడి పైకి వచ్చానని.. దేశంలోనే టాప్ ఎడ్యూకేషనలిస్ట్ అని తనకుతానే చెప్పుకున్నారు. పదుల సంఖ్యలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. తన కష్టార్జితం వందల ఎకరాల భూములు కొన్నట్లు చెప్పారు. అప్పడు రూ. లక్ష పెట్టి కొనుగోలు చేసిన భూములు నేడు రూ. కోటికి పెరిగాయని తెలిపారు. అయితే తెలంగాణ రాజకీయ నేతల్లో అంత్యత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న మల్లారెడ్డికి సొంత కారు లేదు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించారు. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నప్పటికీ.. చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని చెప్పారు. తనకు సొంతంగా కారు కూడా లేదని అఫిడవిట్లో పొందుపరిచారు. మేడ్చల్ జిల్లా సూరారం, కండ్లకోయ, ధూలపల్లి, జీడిమెట్ల, గుండ్ల పోచంపల్లి, గుండ్ల పోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు చెప్పారు. మైసమ్మగూడ, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి, కొంపల్లి, అబిడ్స్‌లో వాణిజ్య భవనాలున్నాయని అఫిడవిట్లో వెల్లడించారు.









