తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. తొలి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో లిస్టులో 45 మందికి స్థానం కల్పించింది. దీంతో మెుత్తంగా 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులోనూ 4 స్థానాలు కమ్యూనిస్టులు కేటాయిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక ప్రజాయుద్దనౌక గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి వెన్నెల బరిలోకి దిగుతున్నారు. గద్దర్ తాను చనిపోవడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన చనిపోయాక టీపీసీ రేవంత్ ఇతర కాంగ్రెస్ నేతలు దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఇక వెన్నెలకు టికెట్ కేటాయించటం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత పోటికి దిగుతున్నారు. తన తండ్రి మృతి, మహిళ సెంటిమెంట్‌తో ఆమె బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టేలా అదే సెంటిమెంట్ ప్లాన్‌తో వెన్నెలకు బరిలోకి దింపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గద్దర్ మృతి సానుభూతి, మహిళాకు ప్రాధాన్యత ఇవ్వటం వంటివి బేరీజు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా పక్కా వ్యూహ్యంతో కాంగ్రెస్ పార్టీ వెన్నెలకు టికెట్ కేటాయించారు.









