బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే పిలిచి మరి మంత్రిని చేశాను అని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తుమ్మలకు ద్రోహం చేయలేదు.. తుమ్మలే బీఆర్ఎస్ కు ద్రోహం చేశాడు అని ఆరోపించారు సీఎం కేసీఆర్.
”నా మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడపై ఓడిపోయాడు. పిలిచి మంత్రిని చేశా. పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ఆలోచించాలి. అది రాజకీయం కాదు. పాలేరు నుండి కందాళ ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీ గేట్ దాటనీయండి. పాలేరుకి దళితబంధు పథకం నియోజకవర్గం అంతా ఇస్తా.
నోట్ల కట్టలతో వచ్చే వారు ఏమీ చేయరు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గిరిజనుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. పేద మహిళలకు నెలకు 3వేల రూపాయలు ఇస్తా. సన్న బియ్యం ఇస్తాం. కేసీఆర్ భీమా ఇస్తా. గ్యాస్ సిలెండర్ 400కే ఇస్తా. ఖమ్మంలో రెండుసార్లు ఒక్కొక్క సీటు ఇచ్చారు. ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.
పాలేరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ” ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకులు ఉన్నారు. వారికి డబ్బు అహంకారం ఉంది. డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా చేయగలం అనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయం అని అంటున్నారు. ప్రజలు అనుకున్న తర్వాత అసెంబ్లీ వాకిలి ఎవరు తొక్కుతారో అందరికీ తెలుసు. మీరంతా అనుకుంటే దుమ్ము లేవదా? కాంట్రాక్టులతో డబ్బు సంపాదించి, ఆ డబ్బు మదంతో ప్రజలనే కొంటాం అంటున్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిమ్మల్ని ఏమారుస్తారు. అదే చెయ్యి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారు. ఆ మాట మర్చిపోవద్దు. లేదంటే దెబ్బతింటారు జాగ్రత్త” అని పాలేరు ప్రజలను హెచ్చరించారు కేసీఆర్.









