దొరల తెలంగాణకు.. ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్ర లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన జగిత్యాల లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. క్వింటా పసుపుకు రూ.12వేలు ధర కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధమని.. ఈ అనుబంధం ఈనాటిది కాదని… నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందని అన్నారు. బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS), ఎంఐఎం (MIM) ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, వీరిమధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీకి, బీఆర్ఎస్… రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం సహకరించుకుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే… తనపై కేసులు పెట్టారని, లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లు భారత ప్రజలని.. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందని, తనను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో.. కానీ ప్రజల హృదయాల్లోంచి కాదని అన్నారు. కులగణనపై పాట్లమెంటులో డిమాండ్ చేశానని, ప్రధాని మోదీ తన ప్రశ్నకు జవాబు చెప్పలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కులగణనకు ముందుకు రావడంలేదని, కులగణన అటు మోదీకి.. ఇటు కేసీఆర్‌కు ఇష్టంలేదని అన్నారు. దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్‌లది కీలక పాత్రని.. అలాంటి అధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారన్నారు. అందుకే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ సంపదను ప్రధాని మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతామన్నారు. కులగణన ఎక్స్ రే లాంటిదని, కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.