AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారును పోలిన గుర్తులపై ఢిల్లీ కోర్టులో పిటిషన్.. ఇంతలోనే వెనక్కి తీసుకున్న బీఆర్‌ఎస్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్-30న పోలింగ్ జరగనుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ పార్టీ మేధోమథనం చేస్తోంది.
మొదట అలా..!
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు కారణంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. ఈసారి అలా జరగకూడదని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే కారును పోలిన గుర్తులు తొలగించాలంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ సానుకూలమైన ఫలితం రాకపోవడంతో ఇవాళ ఉదయం ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆ పార్టీ నేతలు ఆశ్రయించారు. కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకీ కేటాయించొద్దంటూ బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరొక పార్టీకి కేటాయించడం వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని రిట్ పిటిషన్‌లో గులాబీ పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టే లోపే బీఆర్ఎస్ ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.

గంటల వ్యవధిలోనే ఇలా..!
అలా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం.. మళ్లీ వెనక్కి తీసుకోవడం ఇవన్నీ గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. మరికాసేపట్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ ఆశ్రయించనుంది. కారును పోలిన గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించాలే ఆదేశాలు ఇవ్వాలంటూ భారత రాష్ట్ర సమితి ధర్మాసనాన్ని ఆశ్రయించనుంది. ధర్మాసనం ఎలా రియాక్ట్ అవుతుంది..? కారు పార్టీకి అనుకూలంగా తీర్పు ఉంటుందా..? లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి, అంతకుమించి ఉత్కంఠ బీఆర్ఎస్‌లో నెలకొంది.

ANN TOP 10