ఎన్నికల నేపథ్యంలో 24/7 పోలీసు నిఘా కొనసాగుతుందని సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జోన్ల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్‌పై ఫోకస్..
ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో 1,587 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు. ఒక్క సౌత్‌జోన్‌లోనే 300కు పైగా ఉన్నాయని, సున్నితమైన, వివాదాస్పదమైన ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా పెంచాల్సి ఉంటుందన్నారు. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, కొట్లాటలు ఇతరత్రా సమస్యలను పరిగణనలోకి తీసుకుని, మ్యాపింగ్ చేయాలని ఇన్స్పెక్టర్లకు సూచించారు.