AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవుళ్లను కూడా మోసం చేస్తున్న కేసీఆర్‌ కుటుంబం

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఫైర్‌

జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా కుటుంబం అంతా దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్‌ ముందుగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొండగట్టుకు తక్షణం రూ. 500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొండగట్టును అబద్ధాల వాగ్ధానాలతో సీఎం కేసీఆర్‌ మోసం చేశారన్నారు. కవిత హనుమాన్‌ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేశారని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు దేవుళ్లను కూడా మోసం చేశారని వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు బస్సు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం కోడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్‌ ను రేవంత్‌ పరిశీలించారు. ఎనిమిదేళ్లుగా రిజర్వాయర్‌ పనులు జరగడంలేదని ఈ సందర్భంగా స్థానికులు తెలియజేశారు. మత్తడి నిర్మాణం, బ్రిడ్జ్‌ నిర్మాణం, 135 బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై రేవంత్‌ మాట్లాడుతూ… పోతారం రిజర్వాయర్‌కు రూ.25 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తి అవుతాయని తెలిపారు. పనులు పూర్తయితే కొనాపూర్‌, సూరంపేట, పోతారం, కొడిమ్యాల రైతులకు నీళ్లు అందించవచ్చని రైతులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10