AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు పాలమూరు ఎత్తిపోత ప్రారంభం.. ప్రత్యేకతలివే..

కాళేశ్వరం తర్వాత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోత పథకాన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద నిర్మించిన మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు బటన్‌నొక్కి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. లిఫ్ట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను కేసీఆర్ ఆన్‌ చేస్తారు. అక్కడే సర్జ్‌పూల్‌, పంప్‌హౌస్‌ను పరిశీలించి అక్కడి నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్‌ వద్ద డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కొల్లాపూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో ప్రారంభించారు. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా దీనిని చేపట్టారు. అరవై రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి.

ఇక ఈ ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. ఆసియా ఖండంలోనే తొలిసారి అతి పెద్దదైన ఎత్తిపోతల పంపులను పాలమూరు ప్రాజెక్టులో ఏర్పాటు చేశారు. 550 టన్నుల బరువుతో 145 మెగావాట్ల సామర్థ్యంతో నడిచే ఈ మోటారు 95 వేల హెచ్‌పీతో సమానం.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు..
లిఫ్ట్ స్టేజీలు: 5
రిజర్వాయర్లు: 6
ఆయకట్టు: 12.30 లక్షల ఎకరాలు
లబ్ధిపొందే జిల్లాలు: 6
ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 2 టీఎంసీలు
నీటి నిల్వ సామర్థ్యం: 67.74 టీఎంసీలు
పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు
నీటిని లిఫ్ట్ చేసే గరిష్ఠ ఎత్తు: 672 మీటర్లు
సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు
తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు
ఇరిగేషన్‌కు: 75.94 టీఎంసీలు
పరిశ్రమలకు: 3 టీఎంసీలు
ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్
అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్దలు
మూడు పంప్ హౌజ్లలో భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటుచేయడం ఇదే ప్రథమం.
ఈ మోటార్లను దేశీయ దిగ్గజం బీహెచ్ఈఎల్ తయారుచేయడం విశేషం
145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటర్ల వినియోగం

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10